ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులో పరమేశ్వరుడు శీర్షాసనం వేసి యోగ నిద్రలో కనిపిస్తుంటాడని తెలుసుకున్నాం కదా.. పార్వతీపరమేశ్వరులిద్దరూ ఒకే పీఠంపై స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. భీమవరం ప్రాంతంలో మహా సముద్రమైన బంగాళాఖాతం మహా చెరువుగా ఉండేదట. అక్కడ శంబరీవి ద్వీపం ఉండేది. ఆ ద్వీపం లోనే శంబరుని ఉనికి ఉన్నట్టుగా చెబుతుంటారు. యముడు సంహరించిన శంబరుడు శ్రీరామచంద్రుడి కాలం నాటి వాడు కావడంతో ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని చెబుతారు.
ఇక్కడి ఆలయంలోని శక్తిశ్వరుడు శీర్షాసనం వేసి యోగ నిద్రలో ఉంటాడని తెలుసు కదా. స్వామివారి తల భాగం భూమిని తాకుతూ జటాజూటం నేలపై ఉంటుంది. ముఖం, ఆ పైన కంఠం వరుసగా ఉదరం, ఆపైన మోకాళ్ళు, చీలమండలు, పాదాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. శివుడు యోగ నిద్రలో ఉంటాడని చెప్పుకున్నాం కదా.. స్వామివారి యోగ నిద్రకు భంగం కలగకుండా తన మూడు నెలల పసికందును ఒడిలో పెట్టుకుని పార్వతీమాత కాపలాగా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. జగన్మాతను అమ్మలా చూసే మహద్బాగ్యం ఇక్కడే కలుగుతుందని భక్తులు చెబుతుంటారు.