మన దేశంలో ఎన్నో మహిమాన్విత ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలోని రుద్రపురం అనే గ్రామంలో ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడి శివలింగం అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడని పిలుస్తారు. ఈ శివలింగం.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగమని అంటారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ ఆలయంలోనైనా శివలింగం పానవట్టం మీద ఉంటుంది. ఈ శివలింగం మాత్రం సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది.
దుగ్దేశ్వరనాథుడి ఆలయం ఈనాటిది కాదు.. దీనికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శివలింగం అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది. ఎంతసేపు కదులుతుందనేది మాత్రం చెప్పలేం. ఒక్కోసారి అయితే ఒక రోజంతా కదులుతూ ఉంటుంది. అలా రోజంతా కదిలే సమయంలో స్థానిక భక్తులు శివయ్యను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. చాలా సేపు కదిలి ఆగిపోయిన తర్వాత మళ్లీ కదిలిద్దామని ఎవరైనా ప్రయత్నించినా ఒక్క అంగుళం కూడా కదలదట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ శివలింగం భూమి లోపల ఎంత లోతుతో ఉందనేది కూడా ఎవరికీ తెలియదట. గతంలో కొందరు తెలుసుకుందామని చాలా వరకూ తవ్వి తవ్వి అలసిపోయి వదిలేశారట.