దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అన్ని దేవాలయాల్లోనూ అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుగుతున్నాయి. దుర్గా మాతను పలు ప్రాంతాల్లో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే పలు చోట్ల అమ్మవారి విగ్రహాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకచోట ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం చూసు తిప్పుకోనివ్వడం లేదు. అది ఎక్కడ? అమ్మవారిని ఎలా ప్రతిష్టించారో తెలుసుకుందాం. కోల్‌కతాలోని లాలాబాగన్ నబన్ కూర్ వద్ద దుర్గామాతను పర్యావరణహితంగా రూపొందించారు. అమ్మవారి విగ్రహం సహా పరిసర ప్రాంతాన్నంతటినీ పచ్చదనంతో నింపేశారు.
అమ్మవారి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. అలాగే ఆ పరిసర ప్రాంతమంతా అక్కడి నుంచి మనల్ని కదలనివ్వదు. అంతా పచ్చదనమే. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు దుర్గమాతను వినూత్న పద్ధతిలో అక్కడి నిర్వాహకులు ఇలా ఏర్పాటు చేశారు. మండపంలో ఆహ్లదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి ప్రతిమను వెదురు, మనీ ప్లాంట్, కూరగాయలు, పలు రకాల పండ్లతో అలంకరించారు. దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు సిబ్బంది ఐదు నెలలు శ్రమించింది. దాదాపు 8 వేల మొక్కలతో అందంగా రూపొందించిన మండపంలో అంతే అందంగా అమ్మవారిని ప్రతిష్టించారు.