శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నాగ పంచమి కూడా ఒకటి. ఈ రోజున మనం నాగదేవతను పూజించుకుంటాం. నాగ పంచమి ఈ నెల 9వ తేదీన రానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయం సంవత్సరమంతా మూసే ఉంటుంది. ఇక ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ మహత్యం ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో మూడవ అంతస్తులో ఉంది. దీనిని నాగ చంద్రేశ్వర ఆలయమని పిలుస్తారు. ఇక ఈ ఆలయాన్ని శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి రోజున మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయంలో సర్పాల రాజౌన తక్షకుడు నివసిస్తాడని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయంలోని నాగదేవత విగ్రహం 11వ శతాబ్దంలో నేపాల్ నుంచి తీసుకొచ్చారని చెబుతారు. ఈ విగ్రహంలో నాగేంద్రుడు, శివుడు కలిసి కనిపిస్తారు. ఇలాంటి విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. శివ పార్వతులు తమ తనయుడు గణపతితో కలిసి పది ముఖాల సర్పరాజుని పీఠంగా చేసుకుని కుర్చుని ఉంటారు. వాస్తవానికి ఇలాంటి విగ్రహాన్ని ప్రపంచంలో మరెక్కడా చూడలేము. అందుకే ఇది చాలా ప్రత్యేకం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. సర్ప దోషాల నుంచి విముక్తి లభిస్తుందట. ఇక ఈ ఆలయ తలుపులు ఈ నెల 8వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 12 గంటల వరకూ మాత్రమే తెరుచుకుని ఉంటాయి.