శ్రావణ మాసంలో ముఖ్యంగా శివుడిని పూజిస్తూ ఉంటారు. అసలు ఈ మాసం శివుడికే అంకితం అంటారు. అయితే ఈ మాసంలో లక్ష్మీదేవిని కూడా భక్తులు పూజిస్తూనే ఉంటారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ దేవిగా కొలుచుకుంటూ అమ్మవారి వ్రతం నిర్వహిస్తారు. మరి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే ఫలితం బాగుంటుందో తెలుసా? పద్మపురాణం ప్రకారం.. లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించినట్లుగా చెబుతారు. అందుకే.. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందాలంటే.. దీపం వెలిగించాలట. నిత్యం దీపారాధన చేసేందుకు వీలు పడని వారు మంగళ, శుక్రవారాల్లో ఇంటి ఆగ్నేయ మూలలో దీపం వెలిగించాలట.
దీపం వెలిగిస్తే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారట. శ్రావణ మాసంలో నిత్యం లేదంటే పైన చెప్పిన రోజులలో ఆగ్నేయ మూలలో పీట పెట్టి, అష్టదళ పద్మం ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుందట. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు ప్రతి రోజూ నీళ్లతో అభిషేకం చేయాలి. ఇక ఈ నీళ్లలో కాసిన్ని వట్టి వేళ్లు కలిపి మరీ అభిషేకం చేస్తే చాలా మంచిదట. ఇక లక్ష్మీదేవిని మారేడు దళాలతోనూ.. పద్మ పుష్పాలతోనూ శ్రావణ మాసంలో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు.