ఆషాఢమాసం వచ్చిందంటే అమ్మవారిని భక్తులంతా పలు రకాలుగా సేవించుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల బోనం ఎత్తితే.. మరికొన్ని చోట్ల శాకంబరీ ఉత్సవాలు నిర్వహిసతారు. విజయవాడ కనకదుర్గమ్మకు అయితే సారె సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అమ్మలగన్న అమ్మకు ప్రతి ఏటా ఆషాఢమాస ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. ఈ క్రమంలోనే మహిళా భక్తులంతా అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆగస్ట్ 4వ తేదీ వరకూ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
అమ్మవారికి ఆషాఢం సారెలో భాగంగా.. చీర, పసుపు, కుంకుమ, గాజులను మహిళలు సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ వెలసింది. ఇంద్రాది దేవతలు కనకదుర్గమ్మను ఇంద్రకీలాద్రిపై ఉండాలని కోరారట. వారి కోరికపై ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా అమ్మవారు వెలిసింది. చాలా మంది రాజులు అప్పట్లో అమ్మవారిని కొలిచేవారట. 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు, శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి.