ఈ నాగదేవత ఆలయాన్ని సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే ఎందుకు తెరుస్తారంటే..

శ్రావణ మాసంలో ముందుగా నాగ పంచమి పండుగ రానుంది. ఈ నెల 9వ తేదీన మనం నాగ పంచమి చేసుకోనున్నాం. ఈ క్రమంలోనే ఓ నాగదేవత ఆలయం గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో మూడవ అంతస్తులో ఉంది. దీనిని నాగ చంద్రేశ్వర ఆలయమని పిలుస్తారని తెలుసుకున్నాం. ఇది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో విగ్రహం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శివ పార్వతులు తమ తనయుడు గణపతితో కలిసి పది ముఖాల సర్పరాజుని పీఠంగా చేసుకుని కుర్చుని ఉంటారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.

ఇక ఈ ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఎందుకు తెరిచి ఉంటుందో చూద్దాం. ఒకసారి సర్పరాజు అయిన తక్షకుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడట. దీనికి సంతోషించిన శివయ్య సర్పరాజుకు అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి శివుని సన్నిధిలోనే సర్పరాజు ఉండటం ఆరంభించాడట. ఈ క్రమంలోనే తక్షకుడు తన ఏకాంత సేవకు ఎలాంటి భంగం వాటిల్ల కూడదని శివుడిని వరం కోరాడట. దీనికి శివుడు వరమిచ్చాడట. అప్పటి నుంచి సర్పరాజు ఏకాంత సేవకు భంగం కలిగించరు. నాగ పంచమి ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించి తిరిగి మూసివేస్తారు.

Share this post with your friends