పూజా క్రతువు ఏదైనా కానివ్వండి ఆడవారు.. మగవారు పట్టు వస్త్రధారణ చేయాలంటారు. ఇది హిందూ సంప్రదాయంలో భాగంగా పరిగణిస్తూ ఉంటారు. పెళ్లిలో కూడా పట్టు వస్త్రాలే కీలకం. ఇప్పుడు పట్టు వస్త్రాలను స్టేటస్ సింబల్‌గా పరిగణిస్తున్నారు కానీ అప్పట్లో అయితే పూజాది క్రతువుల్లో తప్పనిసరి. మనమే కాదు.. దేవతలకు సమర్పించినా కూడా పట్టు వస్త్రాలనే సమర్పిస్తూ ఉంటాం. శ్రీరాముడి కల్యాణ మహోత్సవంలోనూ.. శ్రీవారికి.. ఇలా పలు దైవకార్యాల్లో పట్టు వస్త్రాలను తీసుకెళ్లి దేవతలకు అందజేస్తారు. అసలు పట్టు వస్త్రాలకు.. హిందూ సంప్రదాయానికి సంబంధం ఏంటి? దీని గురించి ధర్మ శాస్త్రం ఏం చెబుతోంది?
సృష్టిలో జీవించి ఉన్న ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అని పిలవబడే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. అది మనలోని శారీరక, మానసిక స్థితి గతులను బట్టి మారుతూ ఉంటుందట. అలాగే పట్టు వస్త్రాలను మనం ధరించినప్పుడు ఈ ఓరా మరింత శక్తివంతంగానూ.. కాంతివంతంగానూ మారుతుందట. ఈ క్రమంలోనే చుట్టూ ఉన్న అత్యున్నతమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి.. మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. పవిత్ర కార్యాచరణ అన్నింటిలోనూ.. పెళ్లిళ్లలోనూ.. పూజాది క్రతువులు చేసేదెప్పుడు.. గుడికి వెళ్లేటప్పుడు ఆడవారు, మగవారు పట్టు చీరలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయాల్లో ఇది తప్పనిసరి కాకున్నా కూడా దీనిని నేటికీ అనుసరిస్తూ వస్తున్నాం.