
దేవుని దర్శనానికి ఆలయానికి వెళ్లిన తర్వాత, దేవుడిని దర్శించుకోవడానికి ముందు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దర్శనం తరువాత దేవాలయంలో ఎందుకు కూర్చోవాలో తెలుసుకుందాం. దైవ దర్శనం కోసం గుడికి వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి గుడి మెట్లపై లేదా గుడి ఆవరణలో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలని పెద్దలు చెబుతారు. చక్కగా దేవుడిని దర్శనం చేసుకుని.. ఆలయంలోనే రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి. ‘‘అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనమ్।దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరా’’ అంటారు.
ఆ శ్లోకం అర్థం ఏమిటంటే.. ‘‘ఓ పరమశివా! నాకు ‘అనాయాసేన మరణం’ అనగా నొప్పి లేని మరణం కావాలి’’ అని అర్థం. అంటే అనారోగ్యంతో మంచం మీద బాధపడాల్సిన అవసరం లేని మరణము అని అర్థం. మంచిపై పడి ఉండి ఎవరితోనూ ఎలాంటి సేవలు చేయించుకోకుండా మరణించాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ‘వినా దైన్యేన జీవనం’ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే. జీవితంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నిస్సహాయత రాకుండా చూడమని కోరుకోవాలి. అలాగే “దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరా ” అనగా మరణం మన దరి చేరినప్పుడు భగవంతుని రూపం గుర్తుండాలి. మరణ సమయంలో భగవంతుని నామమే స్మరణకు వచ్చేలా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుని వేడుకోవడం.
