
కుంకుమార్చనను స్త్రీలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీ. వినాయకచవితి మహోత్సవాలు జరిగినా.. దేవీ నవరాత్రుల సమయంలో.. అలాగే ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా కుంకుమార్చన నిర్వహించుకోవడం పరిపాటే. దీనికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం.
ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతులలో చేస్తారు అవేంటో ముందుగా తెలుసుకుందాం. దేవతా మూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం, పాదాల నుంచి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడం, కుంకుమను నీటిలో లేదా పన్నీరు (గులాబీ నీరు)లో కలిపి అభిషేకం చేయడం వంటివి చేస్తారు. ఇలా చేస్తే సౌభాగ్యంతో మహిళలు సంతోషంగా జీవిస్తారని నమ్మకం.
