గణపతి పూజకు ఉన్నంత ప్రాధాన్యత మరే దేవుడికి లేదనే చెప్పాలి. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా గణపతితోనే ప్రారంభిస్తూ ఉంటాం. ఇక కొందరు గణపతితో పాటు లక్ష్మీదేవిని పూజించాలని చెబుతారు. ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఇబ్బందుల నుంచి గట్టెక్కడంతో పాటు ఆర్థిక కష్టాల నుంచి కూడా బయటపడతామట. శాస్త్రాల ప్రకారం వినాయకుడు జ్ఞాన సంపదకు ప్రతీక అయితే లక్ష్మీదేవి సంపదకు దేవత. కాబట్టి ఇద్దరినీ కలిపి పూజిస్తే.. భక్తులు తమ బాధల నుంచి విముక్తి పొందుతారని.. కోరికలు నెరవేరుతాయని.. ఫలితం శీఘ్రంగా వస్తుందని చెబుతారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. లక్ష్మీదేవి సముద్రం నుంచి జన్మించింది. అందుకే నీటి మాదిరిగా లక్ష్మీదేవి సైతం స్థిరంగా ఒకచోట ఉండదని అంటారు. ఆమె ఒకచోట ఉండాలి అంటే మనం నిర్మలమైన మనసుతో అమ్మవారిని పూజించాలట. చాలా మంది వ్యాపారస్తులు ఉదయాన్నే వినాయకుడు, లక్ష్మీదేవిని పూజించిన తరువాతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇళ్లలోనూ గణపతి, లక్ష్మిదేవిని కలిపి పూజిస్తారు. పురాణాల ప్రకారం.. ఎవరి వద్ద అయినా అధికంగా సంపద అనేది ఎవరి వద్ద పడితే వారి వద్ద ఉండదట. జ్ఞానం ఉన్న చోటు మాత్రమే సంపద ఉంటుందట. అందుకే లక్ష్మీదేవితో కూడిన గణేశుడిని మనం కొలుచుకోవాలట.