శివుడిని త్రిపురారి అని ఎందుకు అంటారు?

శివుడిని పరమేశ్వరుడు, శంకరుడు వంటి పేర్లతోనే కాకుండా త్రిపురారి అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనికి కారణమేంటంటే.. పూర్వం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను నిర్మించుకుని వాటికి త్రిపుర అని పేరు పెట్టారు. ఇవెప్పుడూ వేర్వేరు దిశల్లో ఎగురుతూనే ఉండేవి. ఇక ఈ ముగ్గురు రాక్షసులు ప్రజలనే కాకుండా, దేవతలను సైతం నానా కష్టాలకు గురి చేసేవారు. రాక్షసులు భూమిపై బీభత్సం సృష్టించి అనంతరం తమ నగరాలకు వెళ్లిపోయేవారు. ఈ మూడు నగరాలను నాశనం చేయాలంటే ఇవి మూడు ఒక సరళ రేఖ పైకి రావాలి. ఆ సమయంలో ఒకే ఒక్క బాణంతో కొట్టి నాశనం చేయాల్సి ఉంటుంది.

ఇలా మూడు సరళ రేఖపైకి వచ్చే క్షణం ఎప్పుడో తెలియదు. వీటిని నాశనం చేయడం అంత సులువేమీ కాదు. తమను ఎవరూ నాశనం చేయలేరన్న గర్వంతో మరింత బీభత్సం సృష్టించసాగారు. అప్పుడు దేవతలు శివుడిని ఆశ్రయించడంతో ఆయన రాక్షసులను సంహరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భూమిని తన రథంగానూ.. సూర్యచంద్రులను రథానికి చక్రాలుగానూ.. ఆది శేషుడు విల్లునూ.. మహా విష్ణువు ధనుస్సుగానూ మారారు. మంధర పర్వతాన్ని ఎక్కి శివుడు సమయం కోసం వేచి చూశాడు.మూడు నగరాలు ఒకే సరళరేఖపైకి రాగానే బాణం సంధించాడు. అంతే ఆ మూడు నగరాలూ ధ్వసం.. ఆపై రాక్షస సంహారం. ఈ సంహారం తర్వాతనే శివుడికి త్రిపురారి అనే పేరు వచ్చింది.

Share this post with your friends