హిందూమతంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పూజ సమయంలోనూ.. ఇల్లు కట్టే సమయంలోనూ.. చివరకు తినాలన్నా.. పడుకోవాలన్నా కూడా దిశలను పక్కాగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈశాన్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ దిశలో భగవంతుడు ఉంటాడని నమ్ముంతుంటారు. ఈశాన్యంలో కూర్చొని మాత్రమే పూజ చేయాలి అంటారు. ఇది శుభ కార్యాలకు, మతపరమైన కార్యక్రమాలకు అనువైన దిక్కుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ దిక్కులో కూర్చొని చేస్తే ఫలితం ప్రభావవంతంగా ఉంటుంది.
వాస్తవానికి ఈశాన్య దిక్కులో దేవతలుంటారని హిందువుల విశ్వాసం. అందుకే ఏ నిర్మాణమైనా సరే.. దేవుడికి మాత్రం ఈశాన్య దిక్కునే కేటాయిస్తూ ఉంటారు. ఈ దిక్కులో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. పూజా గదిని ఈ దిక్కులో ఏర్పాటు చేసుకుని భగవంతునికి పూజలు నిర్వహిస్తే సత్ఫలితాన్నిస్తాయని నమ్ముతారు. అందుకే ఈశాన్య దిక్కుకు వాస్తు పండితులు పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఈ దిక్కును అత్యంత పవిత్రంగానూ.. శుభప్రదంగానూ భావిస్తారు. ఈ దిశలో భగవంతుడు ఉంటాడని నమ్ముతారు కాబట్టి ప్రతిరోజూ శుభ్రపరుచుకోవాలని పెద్దలు చెబుతారు. పూజ గదిని.. గది లేకున్నా కూడా దేవుళ్ల పటాలను ఈ దిక్కులో పెట్టి పూజిస్తే జీవితంలో సమస్యలు రావని నమ్మకం.