పంచాయతన పూజలో సుబ్రహ్మణ్య స్వామి మూర్తి ఎందుకుండదంటే..

షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర , శాక్త , వైష్ణవ , గాణాపత్య , శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెబుతారు. ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.

మనకి వైదిక వాఙ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య గణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, ‘కుమార’ తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృ తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు… ఎలా పిలిచినా ఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్ , అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం. ఇందులో అమ్మవారు-అవ్యక్తం, అయ్యవారు-వ్యక్త స్వరూపాలకు సంకేతం అయితే, గణపతి-మహత్తత్వం, కుమారస్వామి-అహంకారం. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినది అని చెబుతారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

Share this post with your friends