కుంభమేళా వచ్చే నెలలో జరుగనుందని తెలిసిందే. దీనికోసం ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. దాదాపు నదులన్నింటికీ సంగమ స్థానం తప్పక ఉంటుంది. వీటన్నింటిలో త్రివేణి సంగమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గంగా, యమునా, సరస్వతి అనే మూడు పవిత్ర నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఇవి ప్రయాగ్‌రాజ్‌లోని సంగం వద్ద కలుస్తాయి. కాబట్టి ప్రయాగ్ రాజ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మహా కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ సమయంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు సైతం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద రాజ స్నానం చేయడానికి వస్తారు.
ఆసక్తికర విషయం ఏంటంటే కుంభమేళా సమయంలో అఖారాలు, సాధువులు అంతా త్రివేణి సంగమానికి స్నానమాచరించేందుకు వస్తారు. వారంతా ఆసక్తికరంగా పల్లకీలు, ఏనుగులు, గుర్రాలపై కూర్చుని మరీ వస్తారని అంటారు. ఇక్కడి నీటికి కుంభమేళా సమయంలో శక్తులు వస్తాయట. అందుకే ఇక్కడి స్నానాన్ని రాజస్నానం అంటారు. కుంభమేళా సమయంలో గ్రహాలు, నక్షత్రరాశుల ప్రత్యేక స్థానం కారణంగా నదిలోని నీరు శక్తివంతంగా మారుతుందని నమ్మకం. కాబట్టి ఆ నీటిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు నశించి, ఆత్మ శుద్ధి పొంది మోక్షం వైపు పయనిస్తుందట. అందుకే ఈ రాజస్నానం ఆచరించేందుకు సామాన్యులతో పాటు అఖారాలు, సాధువులంతా ఆసక్తి చూపిస్తారు.