శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు శ్రీ మలయప్ప స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుంటే బ్రహ్మరాక్షసుడు తారసపడ్డాడని ఆ తరువాత ఏం జరిగిందనే కథను తెలుసుకున్నాం. శ్రీనంబదువాన్ కైశిక రాగంలో స్వామివారికి అక్షర మాలను సమర్పించాడు కాబట్టి ఆయన పేరు మీదుగానే ఉత్తాన ద్వాదశికి కైశిక ద్వాదశి అని నామకరణం చేయడం జరిగింది. కైశిక ఏకాదశి రోజు ఒక్క రోజు మాత్రమే శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉగ్ర శ్రీనివాసమూర్తి అవతారంలో సూర్యోదయానికి ముందు ఊరేగిస్తారని తెలుసుకున్నాం. ఆ ఒక్కరోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఎందుకు ఊరేగిస్తారనే దానికి కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తిని భూదేవి శ్రీదేవి సమేతంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారట. ఆ సమయంలో సూర్య కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి కైశిక ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.