మహా కుంభమేళా 12 ఏళ్లకోసారి ఎందుకు?

మహా కుంభమేళాను జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళా. అసలు 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు కుంభమేళాను నిర్వహిస్తారు? ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలుసుకుందాం. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. హిందూమతంలో ఈ కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మహా కుంభ మేళ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే జరుగుతుంది. మన దేశంలో ప్రధానంగా ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది.

అసలు మహా కుంభమేళ 12 ఏళ్లకోసారి ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. దీని వెనుక పౌరాణిక గాధ ఒకటుంది. దీని గురించి పోతనామాత్యుడు మహా భాగవతంలో వివరించాడు. రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగర మధనం గావించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముందుగా సముద్రం నుంచి హాలాహలం, ఆపై అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు మాకు కావాలంటే మాకు కావాలంటూ యుద్ధం చేశారు. ఈ యుద్ధం 12 దివ్య రోజుల పాటు జరిగింది. 12 దివ్య రోజులంటే భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఇక అమృత భాండం నుంచి అమృతం చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయమని చెబుతారు. భూమిపై అయితే నాలుగు ప్రదేశాల్లో అమృత చుక్కలు పడ్డాయట. ఆ నాలుగు చోట్ల 12 ఏళ్లకోసారి కుంభమేళాను నిర్వహించడం ఆనవాయితీ.

Share this post with your friends