
ఒక చెంబుడు నీళ్లు లేదంటే ఒక బిల్వపత్రం సమర్పిస్తే చాలు.. పొంగిపోయి వరాలిచ్చేస్తాడట శివుడు. అందుకే ఆయనను భోళా శంకరుడని పిలుస్తారు. అంతేకాకుండా శివయ్యను అభిషేకప్రియుడని కూడా అంటారు. శివపూజలో అభిషేకానికి, బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరి దేనికీ ఉండదు. బిల్వదళం పేరిట ఏకంగా బిల్వాష్టకమే రచించారంటే దాని ప్రత్యేకతను ప్రత్యేకంగా చెప్పాలా? అసలు సృష్టిలో ఎన్నో రకాల ఆకులుండగా.. బిల్వ పత్రానికే ఎందుకంత ప్రాధాన్యత? శివుడికి ఎందుకు బిల్వపత్రమంటే అంత ప్రీతి? తెలుసుకుందాం.
బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు కూడా భావిస్తారు. శివుడిని బిల్వ పత్రాలతో పూజించే వారిని శని దేవుడు కూడా పీడించడని చెబుతారు. ఒకవేళ శనిదోషం కారణంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే శివుడిని బిల్వపత్రాలతో పూజిస్తే చాలు శని దోషాలన్నీ తొలగిపోతాయట. జాతకరీత్యా ఎలాంటి శని దోషాలున్నా శివుడిని బిల్వపత్రంతో పూజిస్తే అవన్నీ తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన వరమని చెబుతారు. దీనికి సంబంధించిన కథ కూడా ఉంది. కాబట్టి బిల్వపత్రానికి అంత ప్రాధాన్యత.
