శనీశ్వరుడిని కర్మ ప్రదాత అంటారు. మనం చేసిన పనుల ఆధారంగా మన కర్మలను నిర్ణయిస్తూ ఉంటాడట. శని దేవుడిని న్యాయ మూర్తిగా సైతం పరిగణిస్తూ ఉంటారు. ఇక శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం ఆయనకు పూజలు నిర్వహించాలి. అయితే శనీశ్వరుడికి చేసే పూజలో తప్పనిసరిగా నువ్వుల నూనే.. నల్ల నువ్వులు వంటివి వాడుతారు. దీపారాధనకు గానీ.. శనీశ్వరుడికి అభిషేకం చేసేందుకు గానీ నువ్వుల నూనెను వాడుతారు. ఏలిన నాటి శని కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు.. జీవితంలో ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నవారు శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించాలని చెబుతారు.
శనీశ్వరుడికి అభిషేకం, దీపారాధన వంటివి చేసేందుకు అసలు నువ్వుల నూనెనే ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న కారణమేంటో చూద్దాం. రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడట. ఈ క్రమంలోనే శనిదేవుడిని రావణుడు తలకిందులుగా వేలాడదీశాడట. ఆ సమయంలో సీతమ్మను వెదుక్కుంటూ హనుమంతుడు లంకకు వచ్చాడు. అక్కడ హనుమంతుని తోకకు నిప్పంటించడంతో లంక మొత్తాన్ని తగులబెట్టాడు. అప్పుడు ఒక్క శనీశ్వరుడికి తప్ప గ్రహాలన్నింటికీ స్వేచ్చ వచ్చిందట. శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ విముక్తి పొందలేకపోయాడట. దీంతో శరీరానికి గాయాలయ్యాయట. అప్పుడు శనీశ్వరుడిని రక్షించి ఆయన గాయాలకు నువ్వుల నూనెతో మర్థనా చేసి నొప్పి బాధ నుంచి విముక్తి కల్పించాడట. అప్పుడు శనీశ్వరుడు తనపై భక్తితో నువ్వుల నూనెను పోసేవాడు సమస్యల నుంచి విముక్తి పొందుతాడని చెప్పాడట. అందుకే శనీశ్వరుడికి నువ్వుల నూనెను వాడుతారు.