ముక్కోటి అని ఎందుకంటారు? వైకుంఠ ఏకాదశి వ్రత కథేంటి?

ఇవాళ ముక్కోటి ఏకాదశి. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అసలు దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకొచ్చింది? ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వస్తాడని చెబుతారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందట. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి వైకుంఠ ఏకాదశి వ్రత కథ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వైకుంఠ ఏకాదశి వ్రత కథ..

పద్మ పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడు దేవతలను హింసించసాగాడు. అతని దురాగతాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడారు. మురను సంహరించాలంటే ప్రత్యేక అస్త్రం కావాలని విష్ణుమూర్తి గ్రహించాడు. దీంతో ఆయన బదరికాశ్రమంలో హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు యత్నించగా.. ఆయన కంటి చూపు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురను కాల్చేసింది. అప్పుడు విష్ణుమూర్తి సంతోషంతో శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తిని ఏకాదశి ఓ వరం కోరింది. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసమున్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరడంతో విష్ణుమూర్తి వరమిచ్చాడట. అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసమున్న వారి పాపాలన్నీ తొలగిపోతాయి.

Share this post with your friends