పూజ ఏదైనా కలశం ఉండాల్సిందే. కలశంగా ఒక మట్టి, ఇత్తడి, కాంస్య, రాగి, వెండి తదితర లోహాలతో తయారు చేసిన పాత్రను తీసుకుంటాం. దీనిని పవిత్ర జలంతో నింపి.. దాని నిండా నీరు పోసి చిటికెడు పసుపు వేసి మామిడాకులను పైన పెట్టి వాటిపై కొబ్బరి కాయను పెడతారు. అనంతరం కొబ్బరికాయను ఎర్రని వస్త్రాన్ని త్రిభుజాకారంలో చేసి చుడతారు. దీనిని పూర్ణ కలశం లేదంటే పూర్ణకుంభం అంటారు. అనంతరం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించడం ద్వారా కలశంలోని నీరు శక్తిని పొందుతుందట.
ఇక కలశం కింద బియ్యం పోస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే బియ్యం శాంతికి చిహ్నంగా పేర్కొంటారు. నిత్యం మన ఆకలిని తీరుస్తాయి కాబట్టి కృతజ్ఞతగా కలశం కింద బియ్యాన్ని పోస్తారు. ఇక అన్ని లోహాలలో ఉత్తమమైనది రాగి కాబట్టి కలశానికి రాగి పాత్రను వినియోగిస్తే మరీ మంచిదట. దర్భగడ్డిని సైతం కలశం లోపల పెడతారు. దీనికి కారణం.. మనం మంత్రాన్ని జపించినప్పుడు మంత్రాలు ప్రకృతిలోని విద్యుదయస్కాంత శక్తితో కలిసి పోతాయి. ఈ శక్తిని కలశం లోపల ఉన్న దర్భగడ్డి కూడా ఆకర్షిస్తుందట. దీనిని దేవుని సాన్నిధ్యం అని కూడా అంటారు.