వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున మనం అక్షయ తృతీయ జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ నెల 10న అక్షయ తృతీయ జరుపుకునేందుకు అందరం సిద్ధమై పోయాం. అయితే ఇది మాత్రమే కాదు.. మరో విశేషం కూడా ఉంది. అదే పరశురాముని జన్మదినోత్సవం. విష్ణుమూర్తి ఆరవ అవతారంగా మాత్రమే కాకుండా.. శివుని అంశగా కూడా భావిస్తూ ఉంటారు. పరశురాముడు వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ రోజున జమదగ్ని మహర్షికి, రేణుక దేవికి నాలుగవ సంతానంగా జన్మించాడు. తండ్రి మాటకు తలొగ్గి తల్లి తల నరికాడు. అసలు తల్లి తలను ఎందుకు నరికివేయాల్సి వచ్చింది?
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. తల్లిని చంపాలని పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞాపించడంతో తల్లిని నరికి చంపాడు. దీంతో సంతోషించిన జమదగ్ని మహర్షి ఏమైనా వరం కోరుకోమని పరశురాముడికి చెప్పగా.. తిరిగి తన తల్లిని బతికించాలని వేడుకున్నాడు. దీంతో తండ్రి వరం ఇచ్చాడు. తిరిగి రేణుకా దేవి బతికింది. అసలు జమదగ్ని మహర్షి భార్య తలను ఎందుకు నరకమని చెప్పాడంటే.. ఒక రోజు కొడుకులందరూ పని కోసం అడవికి వెళ్ళారట. ఆ తరువాత రేణుకా దేవి నదిలో స్నానానికి వెళ్లిందట. తిరిగి వస్తున్న క్రమంలో చిత్రరథ రాజు నీటిలో స్నానం చేయడం చూసిందట. ఆమె మనస్సు చెలించింది. అయితే ఈ విషయాన్ని ఆమె మొహం చూసిన వెంటనే జమదగ్ని మహర్షి గ్రహించారు. తన కుమారులు ఒక్కొక్కరిని పిలిచి తల్లిని చంపమని ఆజ్ఞాపించగా అంతా నిరాకరించారు. పరశురాముడు మాత్రం తండ్రి మాటకు తలొగ్గి అంగీకరించాడు.