నారదుడిని నారాయణుడు మానస సరోవరానికి ఎందుకు పంపాడు?

నారదుడు ఆగ్రహంతో లక్ష్మీదేవికి శాపమివ్వడం.. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపానికి గురవ్వడం వరకూ తెలుసుకున్నాం కదా. అలాగే నారదుడు తనకు కూడా సంగీతంలో మేటి కావాలని ఉందని చెప్పడంతో నారాయణుడు సలహా ఇచ్చాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉందని.. దానిపై ఒక దివాంధం ఉందని తెలిపాడు. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కావాలని దీవించాడు. అలాగేనని చెప్పి నారాయణుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. వెంటనే మానస సరోవరం చేరుకున్నాడు.

అక్కడ కమ్మని సంగీతం వినిపిస్తోంది. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. సంగీతాభ్యాసం చేస్తున్న వారందరి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ‘గానబంధు’ నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగి కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు ఏతెంచిన కారణమేంటో తెలుసుకున్నాడు. ఆ గానబంధువే ఉలూకపతి. కానీ తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరో నారదుడికి అర్థం కాలేదు. అయితే తనకు కావల్సింది.. సంగీతం నేర్చుకోవడం. అదే విషయాన్ని ఉలూకపతికి విన్నవించాడు. కౌశికుడు, తుంబురుడు తమ సంగీతంతో నారాయణుడిని వశం చేసుకున్నారని తనకూ ఆ విద్య ప్రసాదించమని కోరాడు.

Share this post with your friends