ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం గురించి ప్రతి ఒక్క హిందువుకూ అంతో ఇంతో తెలిసే ఉంటుంది. కన్నయ్య నిర్యాణం తరువాత ద్వారక సముద్రగర్భంలో కలిసిపోయింది. దీనిని నిజం కాదని.. అభూతకల్పనలని కొట్టిపడేసే వారు కూడా ఉన్నారు. కానీ ఆర్కియాలజిస్టులు శోధించి సాధించిన నిజాలు ఇదంతా నిజమనే చెబుతున్నాయి. శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత ద్వారకలో మహా ప్రళయం సంభవించిందని చెబుతారు కదా.. అసలేం జరిగింది? శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించడానికి కారణం ఏంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.
హిందువులు సప్త మోక్ష ధామాలను అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వాటిలో ద్వారక కూడా ఒకటి. దీనిని వేదవ్యాసుడు తను రాసిన మహాభారత కావ్యంలో ద్వారావతిగా సంబోదించడం గమనార్హం. గుజరాత్‌లోని పశ్చిమ తీరంలో సముద్రతీరాన ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు నడయాడాడు. శ్రీకృష్ణుడు మధురలో కంస సంహారం గావించిన తర్వాత మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు మధురలో తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించి వారి కోసం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నింటినీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు.