హిందూ దేవతలకు ఒక్కొక్కరికీ ఒక్కో వాహనం ఉంటుంది. శివుడికి నంది వాహనం.. విఘ్నేశ్వరుడికి ఎలుక, కార్తికేయుడికి నెమలి, విష్ణుమూర్తికి గరుత్మంతుడు, లక్ష్మీదేవికి గుడ్లగూబ, సరస్వతీ దేవికి హంస, దుర్గమ్మకు సింహం వాహనంగా ఉన్నాయి. అసలు దుర్గమ్మకు సింహం వాహనంగా ఎలా మారిందనే దానికి ఓ కథ ఉంది. ఒకసారి శివుడు ధ్యానం కోసం కూర్చుని పూర్తిగా ధ్యాన స్థితిలోకి వెళ్లిపోయి ఎన్నాళ్లైనా బయటకు రాలేదట. దుర్గాదేవి రూపమైన పార్వతీ మాత శివుడి కోసం వేచి చూసి చూసి అలసిపోయి కైలాసాన్ని విడిచి తపస్సు కోసం దట్టమైన అడవిలోకి వెళ్లిపోయిందట.
అక్కడ పార్వతీదేవిని చూసిన ఆకలిగొన్న సింహం ఆమెను తినేందుకు వచ్చిందట. పార్వతీదేవిపై దాడికి సింహం యత్నించగా.. ఆమె చుట్టూ రక్షణ కవచం కారణంగా విఫలమైంది. దీంతో పార్వతీదేవి ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చే వరకూ సింహం వేచి చూస్తూ ఉందట. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను తీసుకెళ్లేందుకు అడవికి వచ్చాడట. శివయ్య రాకతో పార్వతీదేవి ధ్యానం నుంచి మేల్కొంది. ఆకలిగొన్న సింహాన్ని చూసి తనను తినేందుకు వేచి ఉందని గ్రహిస్తుంది. తనను తినాలని సింహం చూసినా కూడా దాని దీన స్థితిని చూసి పార్వతీదేవి హృదయం కరిగిపోయిందట. దీంతో సింహాన్ని తనతో తీసుకువెళ్లిందట. అప్పటి నుంచి సింహం ఆమె వాహనంగా మారిపోయిందని పురాణాలు చెబుతున్నాయి.