
ఆలయాల్లో రహస్య గదులను కాపాడేందుకు నాగ బంధం, జల బంధం వంటి ఎన్నో బంధనాలను వేసి సీల్ చేసే వారు. అసలెందుకు ఈ బంధాలు వేసేవారో తెలుసా? అదేంటో తెలుసుకుందాం. ఈ బంధనాలన్నీ మేరుతంత్రంతో కూడుకున్నవి. ఈ బంధనాలను తొలగించాలంటే సామాన్యులకు అసాధ్యమని అంటారు. దీనికి ఓ సిద్ధ పురుషుడు వచ్చి మంత్రం చెబితే తప్ప తెరుచుకోదట. ఒకవేళ సామాన్యులెవరైనా తెరవాలని యత్నించినా కూడా రక్తం కక్కుకుని చనిపోతారని చెబుతారు. అందుకే ఎవరూ అలాంటి సాహసం కూడా చేయరు. ఇక ఈ బంధాల్లో వాయు బంధం, నాగ బంధం, అగ్నిబంధం, క్రిమి బంధం అంటూ చాలా రకాలు ఉంటాయి.
రాజుల కాలంలో ఆలయాలకు పెద్ద ఎత్తున బంగారం, వజ్రాభరణాలను కానుకగా సమర్పించేవారు. అప్పట్లో ఆలయాలపై ముస్లిం రాజులు ఎక్కువగా దాడి చేసి పంపదను దోచుకెళ్లేవారు. ఈ క్రమంలోనే సంపదను కాపాడేందుకు ఆలయంలోని ఓ రహస్య గదిలో పెట్టి ఏదో ఒక బంధంతో వేసేవారు. ఆ తరువాత దానిని తెరవాలంటే మంత్రాన్ని చెప్పాల్సి వచ్చేది. ఆ మంత్రాన్ని రాజవంశానికి చెందిన ఓ వ్యక్తికి ఉపదేశించేవారు. మంత్రాధీనంలో ఉన్న గదికి నాగబంధం ఉంటే దాని తాలూకు సర్పాలు కాపలాగా ఉంటాయని చెబుతారు. క్రిమి బంధంలో అయితే క్రిములు కాపలాగా ఉంటాయట. జలబంధం అయితే నిత్యం నీరు ఉద్భవిస్తూ ఉంటుందట. ఇలా ఏ బంధం వేసినా పక్కాగా రక్షణ ఉంటుందని నమ్మకం.
