తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాల్లో చివరిది ఫాల్గుణ మాసం. నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 28 నుంచి ఈ మాసం ప్రారంభమైంది. మార్చి 29వ తేదీ వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. అసలు ఫాల్గుణ మాసానికి ఏమైనా విశిష్టత ఉందా? ఇది ఎవరికి ప్రీతికరం? అనేది తెలుసుకుందాం.
మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే ఫాల్గుణ మాసం. ఇది వేసవికి ఆరంభంతో పాటు తెలుగు మాసాల్లోనూ చివరిది.ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది. కాబట్టి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించుకుంటూ ఉంటారు.
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయో వ్రతం ఆచరించారు. ఈ వత్రం ఆచరించిన అనంతరం శ్రీమహావిష్ణువుకు క్షీరాన్నం నివేదిస్తే అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. పూర్వం ఈ పయో వ్రతాన్ని అదితి ఆచరించిందట. ఈ వ్రతాన్ని ఆచరించిన మీదటే ఆమెకు వామనుడు పుత్రుడిగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండే మాసం ఫాల్గుణ మాసమని చెబుతారు. అంతేకాకుండా ఫాల్గుణాన్ని అర్జునుడి జన్మ నక్షత్రమని కూడా చెబుతారు. అందుకే అర్జునునికి ఫల్గుణుడు అని పేరు వచ్చిందట.