శ్రావణమాసం వ్రతాలు, పూజలకు అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రావణమాసం లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసమని అంటారు. ఈ మాసంలో వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రమని చెబుతారు. కాబట్టి విష్ణుమూర్తి పూజకు ఇది ఎంతో విశిష్టమైనమాసం. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు శక్తి బాగా ఉంటుందట.
ఈ శ్రావణమాసంలో శివునికి పూజ చేసుకున్నా చాలా మంచిదని అంటారు. ఈ నెలంతా ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి వేళ స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలట. దీంతో మన జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం ఆచరిస్తాం. దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు తమ వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మొదలు పెట్టి అన్ని నెలలో వచ్చే అన్ని శ్రావణ మంగళవారాల్లో ఆచరిస్తారు. ఐదేళ్ల పాటు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది.