అసలు ఎవరా కాలనేమి? రామాయణంతో ఉన్న సంబంధం ఏమిటి?

కాలనేమికి రామాయణ గాథతో సంబంధం ఉందని మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా. రామాయణంలో మారీచుని గురించి అందరికీ తెలిసిందే. ఆయన కుమారుడే ఈ కాలనేమి. ఇతనొక మాయా రాక్షసుడు. లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. అప్పుడు మేఘనాథుడు ప్రయోగించిన శక్తి బాణం కారణంగా లక్ష్మణుడు మూర్ఛబోయాడు. అతడిని బతికించేందుకు సంజీవని అవసరమైంది. హనుమంతుడు వెళ్లి సంజీవనిని గుర్తించలేక ఏకంగా పర్వతాన్నే ఎత్తుకొచ్చాడు. అయితే అనంతరం జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మాత్రమే కాకుండా ఇతర సైన్యం కూడా మూర్చబోయింది.

అప్పుడు ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్పాడట. మళ్లీ హనుమంతుడే ఆ మూలికను తీసుకుని వచ్చేందుకు ద్రోణగిరికి బయలు దేరాడు. విషయం తెలుసుకున్న రావణుడు కాలనేమి సాయంతో హనుమంతుడిని ద్రోణగిరికి వెళ్లకుండా దారి తప్పించాడు. అదెలాగంటే.. ద్రోణగిరికి వెళ్లేందుకు హనుమంతుడికి దారి తెలియలేదట. దీంతో అక్కడ ఉన్న కాలనేమిని దారి అడిగాడట. దానికి కాలనేమి.. అక్కడ ఉన్న సరస్సులో నీరు తాగితే దప్పిక తీరడమే కాకుండా కార్యసాధనకు శక్తి వస్తుందని నమ్మబలికాడు. వెంటనే హనుమంతుడు కొలనులోకి దిగగా ఆయనను మొసలి పట్టుకుంది.

దానిని చంపేయడంతో శాప విమోచనమై ధాన్యమాలిని అనే అప్సరసగా మొసలి మారిపోయింది. అప్పుడు తన శాపం గురించి మాత్రమే కాకుండా కాలనేమి గురించి చెప్పి.. ద్రోణగిరికి దారి చూపించింది. కాలనేమి గురించి తెలుసుకున్న ఆంజనేయుడు అతని ఆశ్రమానికి వెళ్లాడు. సాయం చేసినందుకు కాలనేమి గురు దక్షిణ కోరగా అతడిని హనుమంతుడు యమపురికి పంపాడు. ఇదీ కాలనేమి కథ. ఈ కాలనేమే ద్వాపరయుగంలో కంసుడిగా జన్మించాడని చెబుతారు. అలా వేషాలు మార్చి.. మనుషులను మోసం చేసేవారిని కాలనేమిగా పిలుస్తారు.

Share this post with your friends