
అసలు నందీశ్వరుడు ఎవరు? ఎందుకు శివాలయంలో ఆయనకంత ప్రాముఖ్యత? ఎందుకు నందీవ్వరుడి కొమ్ముల మధ్య నుంచి శివయ్యను చూడాలి? ఇవన్నీ ప్రశ్నలు ఏదో ఒక సమయంలో మనసులో కలుగుతాయి. దీనికి ముందుగా శ్రీశైల ఖండం కావ్యంలో నందీశ్వరుడికి సంబంధించి ఏం లిఖించారో తెలుసుకుందాం. వాస్తవానికి నందీశ్వరుడు ఎవరో కాదు.. పరమేశ్వరుడి పరమ భక్తుడైన శిలాదుడి కుమారుడు. పుట్టుకతోనే తండ్రి భక్తిలో పాలు పంచుకున్నాడు. నందీశ్వరుడు సైతం పుట్టుకతోనే మహేశ్వరుడిపై భక్తితో ఉండేవాడు. ఒకవైపు సకల శాస్త్రాలనూ అభ్యసిస్తూనే మరోవైపు పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవాడు.
ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా చెక్కుచెదరని దీక్షలో నిమగ్నమై పోయి ఉన్న నందీశ్వరుడిని చూసి శివయ్య చాలా సంతోషించాడు. నందీశ్వరుడి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో నందీశ్వరుడు కేవలం తనకు పదివేల ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని కోరాడు. వెంటనే శివయ్య ఆ వరాన్ని ఇచ్చేశాడు. పదివేల ఏళ్ల పాటు నందీశ్వరుడు తపోదీక్షలో నిమగ్నమైన తరువాత త్రిలోచనుడు ఆయనకు గణాధిపత్యం ప్రసాదించి.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని ప్రసాదించాడు. అటుపై శ్రీశైలంలోనే కొలువుదీరేలా నందీశ్వరుడిని అనుగ్రహించాడు.
