
మహారాష్ట్ర దౌలతాబాద్‌లోని బరైల్ గ్రామంలో కొలువైన ఘృష్ణేశ్వరుడి గురించి ఇప్పటిక కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. దేవగిరి పర్వతం మీద నివసించే సుధర్మ, సుదేహ అనే బ్రాహ్మణలకు సంతానం లేదు. జ్యోతిష్య పండితులను పిలిచి జ్యోతిష్యం చెప్పించుకుంటే సుదేహకు తల్లయ్యే భాగ్యం లేదని చెప్పారట. దీంతో సుదేహ తన చెల్లెలు ఘుష్మతో తన భర్తకు రెండో పెళ్లి చేసింది. ఘుష్మ పరమేశ్వరుడి భక్తురాలు. నిత్యం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఘుష్మ 101 మట్టి శివలింగాలను తయారు చేసి పూజించేది. కొంత కాలానికి ఘుష్మ తల్లైంది. ఆమెకు అందమైన బిడ్డ జన్మించాడు.
ఇది చూసిన సుదేహకు తన చెల్లెలితో పాటు ఆమె కుమారుడిపై అసూయ కలిగింది. ఒకరోజు బిడ్డను చెరువులో విసిరేసి.. ఘుష్మ తయారు చేసిన శివలింగాలను చెరువులో నిమజ్జనం చేసింది. పిల్లాడి మరణ వార్త ఊరంతా వ్యాపించడంతో అంతా శోకసముద్రంలో మునిగిపోయారు. ఘుష్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా శివుడి ఆరాధనలో ఉండిపోయింది. పూజానంతరం శివలింగాన్ని చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లగా అక్కడ శివుడు ప్రత్యక్షమై ఆమె కుమారుడిని బతికించి ఇచ్చాడు. సుదేహను శివలింగంతో సంహరించబోగా ఘుష్మ అడ్డుకుంది. దీనికి సంతోషించిన శివుడు ఆమెను వరం కోరుకోమనగా.. ఈ ప్రదేశంలో నివసించమని కోరిందట. అలా మహాశివుడు ఇక్కడ ఘుష్మేశ్వర మహాదేవగా కొలువుదీరాడు. ఈ శివయ్యను పూజించిన వారికి తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం.
