జనవరి 10వ తేది నుంచి 19వ తేది వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల పురస్కరించుకుని తిరుమలలో చేస్తున్న ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, అడిషనల్ ఎస్పీ శ్రీ రామకృష్ణలతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి రోజు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, టీటీడీ బోర్డు సభ్యులకు రాబ్ భగీచా సర్కిల్ అలైటింగ్ పాయింట్ కేటాయించారు. వీరిని సుపథం నుండి దర్శనాలకు అనుమతిస్తారు. వీరికి రాం భగీచా బస్టాండ్ కిందవైపున పార్కింగ్ ఏర్పాటు చేయగా రామ్ భగీచా బస్టాండ్ వద్ద పికప్ పాయింట్ కేటాయించారు.
అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్ లు, కార్పొరేషన్ చైర్మన్లకు ఏటీసీ సర్కిల్ వద్ద అలైటింగ్ పాయింట్ ఏర్పాటు చేయగా ఏటీసీ సర్కిల్ లోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 మెయిన్ గేటు నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. వీరికి ఎంప్లాయిస్ క్యాంటీన్ వెనుక వైపు పార్కింగ్ ఏర్పాట్లు చేయగా రామ్ భగీచా బస్టాండ్ వద్ద పికప్ పాయింట్ కేటాయించారు. అఖిల భారత సర్వీసు అధికారులకు, ఇతర సీనియర్ అధికారులకు ఏటీసీ సర్కిల్ లో అలైటింగ్ పాయింట్ కేటాయించగా వీరిని వైకుంఠం క్యైకాంప్లెక్స్-1 వద్ద ఉన్న ఎల్-2 గేట్ నుండి దర్శనాలకు అనుమతిస్తారు. వీరికి నందకం, వకుళామాత విశ్రాంతి గృహాల పరిసరాలు, ఫైర్ స్టేషన్ వెనుకవైపు పార్కింగ్ ఏర్పాటు చేయగా పరకామణి భవనం, నందకం వద్ద పికప్ పాయింట్ కేటాయించారు.
శ్రీవాణి ట్రస్టు దాతలకు ఏటీసీ వద్ద అలైటింగ్ పాయింట్ కేటాయించగా ఫుట్‌పాత్ హాల్ నుండి దర్శనాలకు అనుమతిస్తారు. వీరికి వరహాస్వామి గెస్ట్ హౌస్ కు ఎదరుగా ఉన్న సేవా సదన్ వద్ద పార్కింగ్, పికప్ పాయింట్ లను కేటాయించారు. ఇతర దాతలకు ఏటీసీ సర్కిల్ వద్ద అలైటింగ్ పాయింట్ కేటాయించగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల హాల్ నుండి దర్శనాలకు అనుమతిస్తారు. వీరికి ఎన్-6 గేటు వద్ద పార్కింగ్, పికప్ పాయింట్లను కేటాయించారు. అలాగే ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులను ఏటీసీ సర్కిల్ లోని స్టోన్ ఆర్చ్ నుండి, ఎస్ఎస్డీ టోకెన్లు కలిగిన భక్తులను కృష్ణతేజ సర్కిల్ నుంచి క్యూలైన్లలలో దర్శనాలకు అనుమతించనున్నారు.