ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానదని శపించిందెవరంటే..

కుంతీదేవికి ముని ఇచ్చిన వరంతో సూర్య భగవానుడిని ప్రార్థించగా.. కర్ణుడు జన్మించిన విషయం తెలిసిందే. అయితే కుంతీదేవికి ఒక పక్క బిడ్డ కలిగాడని ఆనందించాలో.. వివాహం కాకముందే ఇలా జరిగిందని చితించాలో తెలియలేదట. లోకం ఏమనుకుంటుందోనని భయపడిన కుంతీదేవి బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. తరువాత ఆ బిడ్డ సూత వంశోద్భవుడైన అతిరధుడు, రాధ దంపతులకు దొరికాడు. ఆ బిడ్డే కర్ణుడు. అయితే అతిరధుడు, రాధ దంపతులకు సంతానం లేకపోవడంతో కర్ణుడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కర్ణుడు ఆ తరువాత విలువిద్యలో మేటి అయ్యాడు.

దాన గుణంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. తను ఎదిగే క్రమంలో కర్ణుడు ఎన్నో అవమానాలు, శాపాలు పొందాడు. కర్ణుడి విలువిద్యా ప్రావీణ్యాన్ని చూసిన దుర్యోధనుడు చేరదేసి అంగ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. అలా కర్ణుడు దుర్యోధనునికి ప్రాణ మిత్రుడిగానూ.. విశ్వాస పాత్రుడిగానూ మారాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడిని కలిసిన కుంతీదేవి అతని జన్మ రహస్యం చెప్పి తన కుమారులను సంహరించవద్దని కోరింది. కుంతికి ఇచ్చిన మాటకు కర్ణుడు కట్టుబడి ఉండిపోయాడు. కర్ణుడి మరణానంతరం ధర్మరాజుకు నిజం తెలుస్తుంది. తల్లి కర్ణుడి రహస్యాన్ని దాచినందుకు ఆవేదన చెందిన ధర్మరాజు ‘స్త్రీల నోటిలో నువ్వు గింజ సైతం నానదు’ అని శపించాడు. అందుకే స్త్రీల నోట్లో ఏ మాట దాగదని అంటారు.

Share this post with your friends