
శ్రీకృష్ణాష్టమిని జరుపుకునేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. శ్రావణమాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున కృష్ణాష్టమిగా ఈ పండుగను మనం జరుపుకుంటాం.
ఈ రోజున శ్రీకృష్ణుడు జైలులో దేవకీ గర్భంలో జన్మించాడు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అలాగే శ్రీకృష్ణుడి ఆలయాల్లో జన్మాష్టమినాడు ప్రత్యేక పూజలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే ఈ రోజున కొన్ని ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిదట. మరి ఆ ఆలయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమే కాకుండా.. అత్యధికంగా సందర్శించబడే ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు.. మలయప్పస్వామిగా పూజలందుకుంటున్నాడు. కృష్ణాష్టమిని అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఆలయాన్ని పండుగ నాడు దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయట. అలాగే నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం ఆలయం. ఈ ఆలయంలో నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. కృష్ణాష్టమి నాడు దీనిని దర్శించుకున్నా చాలా మంచిదట. సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా శ్రీ మహావిష్ణువు పూజలందుకుంటున్నాడు. దీంతో పాటు అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను కృష్ణాష్టమినాడు దర్శించుకుంటే చాలా మంచిదట.
