ఏ వారం ఏ రత్నం ధరించాలంటే..

ఏడు వారాల నగల గురించి మనం తెలుసుకున్నాం. ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. గ్రహ అనుకూలత కోసం ఒక్కో రకమైన రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడు వారాలకు గానూ నగలను ధరించేవారు. మరి ఏ రోజు ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలో తెలుసా? అదేంటో ఒకసారి చూద్దాం.

ఆదివారం: దీనినే భానువారమని కూడా అంటారు. ఇది సూర్యునికి బాగా ఇష్టమైనది కాబట్టి సూర్య గ్రహానికి చెందినది ఆదివారం. ఈ రోజున కెంపులతో చేసిన ఆభరణాలను ధరిస్తే చాలా మంచిదట. సూర్య గ్రహ అనుకూలతతో పాటు అనారోగ్య సమస్యలు సైతం దూరమై దీర్ఘాయుష్షు చేకూరుతుందట.

సోమవారం: ఈ వారాన్ని ఇందువారమని కూడా అంటారు. దీనికి చంద్రుడు అధిపతి. కాబట్టి సోమవారం ముత్యాలతో చేసిన ఆభరణాలను ధరించాలి. ముత్యాల ఆభరణాలను ధరిస్తే మానసిక సమస్యలు దూరమై మనసు నిర్మలంగా ఉంటుందట.

మంగళవారం: మంగళవారాన్ని జయవారమని కూడా అంటారు. దీనికి కుజుడు అధిపతి. దీనినే అంగారక గ్రహమని కూడా అంటారు. ఈ రోజున పగడాలతో చేసిన ఆభరనాలను ధరించాలి. ఈ పగడాల నగలను ధరిస్తే వివాహం పక్కాగా సెట్ అవుతుందట. వైవాహిక సమస్యలు తొలగడం, సంతానం కలగడం వంటివి జరుగుతాయి.

బుధవారం: దీన్ని సౌమ్యవారమని కూడా అంటారు. బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి పచ్చలతో చేసిన ఆభరణాలను ధరించాలి.

గురువారం: గురువారానికి అధిపతి బృహస్పతి. పుష్యరాగం పొదిగిన ఆభరణాలను ధరించాలి. దీని వలన ఆర్థికంగానూ.. వివాహ పరంగానూ అన్ని శుభ ఫలితాలుంటాయి.

శుక్రవారం: శుక్రవారాన్ని భృగు వారమని కూడా అంటారు. దీనికి శుక్రగ్రహం అధిపతి కాబట్టి వజ్రాలతో చేిసన ఆభరణాలు ధరించాలి. దీని వలన ఆకస్మిక ధనలాభం, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడం వంటివి జరుగుతాయి.

శనివారం: శనివారాన్ని స్థిర వారమని కూడా అంటారు. దీనికి శని భగవానుడు అధిపతి. నీలమణులు పొదిగిన ఆభరణాలు ధరిస్తే అకాల మృత్యు దోషాలు తొలగుతాయి.

Share this post with your friends