నవరాత్రులలో ఏ రోజున ఏ ఏ రంగు దుస్తులను ధరించాలి?

నవరాత్రి సమయంలో భక్తులు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని కొలుస్తారు. ఆ సమయంలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలతో పాటు దుర్గా చాలీసాను పఠిస్తారు. ఇక నవరాత్రులలో పూజతో పాటు మనం ధరించే దుస్తుల రంగు సైతం ముఖ్యమే. నవరాత్రి తొలి రోజున ఘట స్థాపనతో పాటు శైలపుత్రిని పూజిస్తాం. కాబట్టి తొలి రోజున తెల్లని వస్త్రాలు ధరించి పూజిస్తే మంచిది. రెండవ రోజున బ్రహ్మచారిణిగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి తెలుపు రంగు దుస్తులనే ధరించాలి. ఎందుకంటే బ్రహ్మచారిణి కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది.

మూడవ రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఎరుపు రంగు దుస్తుల్లో పూజించాలి. నాల్గవ రోజున తల్లి కూష్మాండ దేవిని పూజిస్తారు కాబట్టి ఆమెకు ఇష్టమైన ముదురు నీలం లేదా ఊదా రంగు దుస్తులు ధరించాలి. ఐదవ రోజున దుర్గాదేవిని స్కందమాతగా పూజిస్తాం కాబట్టి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. ఆరవ రోజు కాత్యాయని దేవిగా పూజిస్తాం. ఈ రోజున గులాబి రంగు దుస్తులు.. ఏడవ రోజు కాళరాత్రిగా పూజిస్తాం కాబట్టి బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించాలి. ఎనిమిదవ రోజు మహాగౌరి దేవిగా పూజిస్తాం కాబట్టి తెలుపు లేదా ఊదా రంగు.. తొమ్మిదవ రోజున తల్లి సిద్దిధాత్రిగా పూజిస్తాం కాబట్టి పచ్చని వస్త్రాలు ధరించాలి.

Share this post with your friends