కొత్త పని ప్రారంభించాలన్నా.. అనారోగ్య సమస్యలున్నా ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే..

కొన్ని ఆలయాలను సందర్శిస్తే అనారోగ్యం పటాపంచలవుతుందని నమ్మకం. కొన్ని ఆలయాలను సందర్శిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం.. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ఇలా చాలా ఉంటాయి. అక్కడి ఉండే స్వామివారి మీద నమ్మకం మనల్ని సమస్యల నుంచి గట్టున పడేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే హనుమంతుడి ఆలయాన్ని సందర్శిస్తే అనారోగ్యం దరి చేరదట. ఎన్ని అనారోగ్య సమస్యలున్నా పోతాయట. అదే అరగొండ వీరాంజనేయ స్వామి క్షేత్రం. ఇది సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పవిత్ర తిరుపతి పుణ్య క్షేత్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. దీనిని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం అని కూడా అంటారు.

ఎవరైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఆ పని విజయవంతంగా పూర్తవుతుందట. దీనికి నిదర్శనాలు అనేకమున్నాయంటారు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళుతుండగా.. ఒక ముక్క విరిగి పడిందట. ఆ ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి కొలను ఏర్పడిందట. ఈ కొలను ఈక్షేత్రంలోనే ఉందంటారు. ఈ కొలనులోని నీరు సంజీవరాయ తీర్ధంగా ప్రసిద్ధి. ఈ కొలనులోని నీటిని తాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంజీవరాయ తీర్ధంలో సంజీవకరణి, విషల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు, ఔషధాలు కలిసి ఉంటాయట. ఇక్కడ మట్టిని రాసుకుంటే చర్మవాధులన్నీ నశిస్తాయట. పౌర్ణమి రోజు ఈ కొలనులో చంద్రకిరణాలు ప్రసరించి ఈ నీటికి మహత్యం వేయి రెట్లు పెరుగుతుందట. ఈ రోజున తీర్థాన్ని సేవిస్తే అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమవుతాయట. అందుకే పౌర్ణమి రోజున ఈ నీటి కోసం భక్తులు పోటెత్తుతారు.

Share this post with your friends