ఏపీలో అత్యధిక శివలింగాలు కలిగిన దేవాలయం ఎక్కడ ఉందంటే..

శివునికి శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో శివుడిని పూజించుకుంటే చాలా మంచిదని చెబుతారు. ఈ క్రమంలోనే మనం ప్రముఖ శివాలయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం మహాలింగ పంచముఖేశ్వరాలయం. మరి దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయ ప్రత్యేకత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక శివలింగాలున్నాయని ప్రతీతి. ఇదే తరహాలో 1,116 శివలింగాలతో ఆంధ్రప్రదేశ్‌లోని మహాలింగ పంచముఖేశ్వరాలయం ప్రఖ్యాతి గాంచింది. ఈ పంచముఖేశ్వరాలయం ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, జమ్ములపాలెంలో ఉంది.

దీని నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ విశేష కృషి చేశారట. ఆమె పేరు వెంకట శేషమాంబది. ఆమె 1994లో తీర్థయాత్రలకు నేపాల్‌ వెళ్లారట. అక్కడ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న శేషమాంబ ఒకేచోట 524 శివలింగాలను చూసి విస్తుబోయారట. అంతకు మించిన రీతిలో తమ గ్రామంలోనూ శివాలయ నిర్మాణం జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 1,116 శివలింగాలతో దేవాలయ నిర్మాణానికి 1998లో శంకుస్థాపన చేసి 2004లో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. ఈ దేవాలయం గురుమాత అష్టోత్తర శత శక్తిపీఠం పక్కనే ఉంటుంది. దీనిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. సకల దోషాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ముఖ్యంగా ప్రతి సోమవారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఏపీలో అత్యధిక శివలింగాలు ఈ దేవాలయంలోనే ఉండటం విశేషం.

Share this post with your friends