కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ ఆలయం ఎక్కడ ఉందంటే..

శ్రీ మహావిష్ణువుపై అలగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకం చేరిందని తెలుసుకున్నాం కదా.. భూలోకంలోని సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిసిందని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష్మీదేవి ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదని చెబుతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పంచ గంగా నది ఒడ్డున శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంది. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా భాసిల్లుతోంది. అయితే పురాణాల్లో ఈ నగరానికి మరో పేరు ఉంది. స్కాంద పురాణం, దేవీ భాగవతంలో దీనిని కరవీర నగరమని, అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని శక్తి పీఠంగా కొలవడంతో పాటు కొల్హాపూర్‌ను అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. అవిముక్త క్షేత్రం అంటే ఎన్నటికీ విడువలేనిది అని అర్థం. ఎలాగైతే పరమశివునికి కాశీపట్నం అవిముక్త క్షేత్రంగా ఉందో అలాగే శ్రీమహాలక్ష్మికి కొల్హాపూర్ అవిముక్త క్షేత్రంగా పేరొందింది. ఈ ప్రాంతాన్ని వీడి లక్ష్మీదేవి ఎన్నటికీ వెళ్లదట. ఇక అమ్మవారికి కరవీర మహాలక్ష్మి అని మరో పేరు కూడా ఉంది. కాశీ పట్టణాన్ని శివుడు తన త్రిశూలంతో రక్షించిన విధంగానే కొల్హాపూర్‌ను శ్రీ మహాలక్ష్మి తన కరుములతో రక్షించిందని చెబుతారు. అందుకే అమ్మవారిని కరవీర మహాలక్ష్మిగా పిలుస్తారు.

Share this post with your friends