అత్యంత శక్తివంతమైన దక్షిణామూర్తి ఆలయం అరుణాచలంలో ఎక్కడుందంటే..

అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన విషయాలు కూడా తెలుసుకుందాం.

గిరి ప్రదక్షిణ మార్గంలో రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం చెబుతోంది. ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని కింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు.

అగ్ని లింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి. అలాగే అక్కడ శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి. అది స్వామి వారి మీద వేస్తారు. శివసన్నిధి రోడ్‌లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలోకి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉదయం టిఫిన్ ‘ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు. విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి.

Share this post with your friends