లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటానికి పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే మన జీవితంలో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.. మనకు సంపద కలుగుతుందని నమ్మకం. మన దేశంలో లక్ష్మీదేవి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు మాత్రం చాలా ప్రధానమైనవి. మధ్యప్రదేశ్‌లో లక్ష్మీదేవికి సంబంధించి ఒక ఆలయం ఉంది. ఇక్కడ ఆసక్తికరంగా లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబపై కాకుండా ఏనుగుపై స్వారీ చేస్తున్నట్టుగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహా కాళేశ్వరుడు నివసిస్తాడని స్థానికుల నమ్మకం. ఈ మహా కాళేశ్వరుడి నగరంలో చాలా అరుదైన లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ఈనాటిది కాదు. 2000 సంవత్సరాల పురాతనమైన ఆలయమని అక్కడి వారు చెబుతారు. సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కానీ లేదంటే తన వాహనమైన గుడ్లగూబపై కానీ కూర్చున్నట్లు దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఆలయంలో ఆసక్తికరంగా లక్ష్మీదేవి ఏనుగును వాహనంగా మార్చుకుంది కనుక ఈ ఆలయాన్ని గజలక్ష్మీ దేవి ఆలయం అని కూడా అంటారు.