సరస్వతి నది ఎక్కడ పుట్టింది? ఎక్కడెక్కడ ప్రవహిస్తోంది?

సరస్వతి పుష్కరాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మనం ప్రకృతిని ఆరాధిస్తూనే ఉంటాం. ఇది హిందూ సంప్రదాయం కూడా. ఈ క్రమంలోనే జలానికి దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధిస్తాం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు హిందూ సంప్రదాయంలో భాగాలు. కార్తీక మాసంలో అయితే తప్పక నదీస్నానం ఆచరిస్తూ ఉంటారు. ఈ నదీ స్నానాలలో పుష్కర స్నానం మరింత పుణ్యప్రదం. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం దక్కుతుందని హిందువుల భావన. పుష్కర స్నానం అయిన మీదట పితృదేవతలకు పిండప్రదానాలు సైతం చేస్తారు.

ఇక ఇప్పుడు సరస్వతి నది ఎక్కడ పుట్టింది? ఎక్కడెక్కడ ప్రవహిస్తోందో తెలుసుకుందాం. సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మానా గ్రామం. ఈ ప్రదేశం భారత్, టిబెట్ సరిహద్దులో ఉంది. మానా గ్రామంలో పుట్టిన సరస్వతి నది.. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో కూడా ప్రవహిస్తోంది. అలాగే రాజస్థాన్‌లో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటారు. ఇక తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉందని చెబుతారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ భక్తుల పుణ్య స్నానాల కోసం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది.

Share this post with your friends