కృష్ణరాయ, రంగనాయక, తిరుమలరాయ మండపాలు ఎక్కడున్నాయంటే..

తిరుమల శ్రీవారి ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్థంభాల‌పై ముస‌లిపై ఉన్న సింహం, దానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాల‌తో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమండపం. ఈ మండ‌పంలో కుడివైపున తిరుమల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవ‌రాయల నిలువెత్తు రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.

రంగనాయక మండపం : శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల‌ మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ.శ 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారు. ఈ మండ‌మంలో వివిద‌ రకాల శిల్పాలతో సుందరంగా మండప‌ నిర్మాణం జరిగింది. క్రీ.శ 1320 – 1360 మ‌ధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు.

తిరుమలరాయ మండపం : రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే ఊంజ‌ల్‌మండ‌పం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగా, క్రీ.శ.16వ శ‌తాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆర‌వీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందులోని స్థంభాల‌పై శ్రీ వైష్ణ‌వ, ప‌శు–పక్షాదుల‌ శిల్పాలు ఉన్నాయి. ఈ మండపంలో రాజా తోడ‌ర‌మ‌ల్‌, అత‌ని త‌ల్లి మాతా మోహ‌నా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్ర‌హ‌లు ఉన్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

Share this post with your friends