హిందూ మతం ప్రకారం గ్రహణ కాలాన్ని అశుభ సమయంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. పైగా గ్రహణ సమయం ఉన్నంత సేపు కనీసం ఆలయ ద్వారాలు కూడా తెరవరు. ఈ సమయంలో కొన్ని రకాల మంత్రాలను జపిస్తూ దైవ నామ స్మరణ చేస్తారు. గ్రహణ సమయంలో కనీసం భోజనం కూడా చేయరు. ఇలా చేయడం వల్ల గ్రహణ దుష్ఫలితాలు తగ్గుతాయని నమ్మకం. కొద్ది రోజుల క్రితమే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ ఏడాదిలో గ్రహణాల సంగతేంటి? తొలి గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? దాని ప్రభావం భారతదేవంలో ఉండనుందా? వంటి విషయాలు తెలుసుకుందాం.
2025లో మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు గ్రహణాలు సూర్యునిపై, మరో రెండు గ్రహణాలు చంద్రునిపై ప్రభావం చూపనున్నాయి. నాలుగు గ్రహణాల్లో ఒకటి తప్ప మిగిలిన మూడు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు.ఇక తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది ఎప్పుడంటే.. 2025 సంవత్సరంలో మార్చి 14వ తేదీన పౌర్ణమి తిథి నాడు మొదటి గ్రహణం చంద్రునిపై ప్రభావం చూపుతుంది. చంద్రగ్రహణం ఏర్పడే సమయం భారతదేశంలో ఉదయం కాబట్టి భారతదేశ ప్రజలకు ఈ చంద్రగ్రహణం కనిపించే అవకాశం లేదు. అమెరికా, పశ్చిమ యూరప్, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర , దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.