హిందువుల ముఖ్యమైన పండగలలో ఒకటి వినాయక చవితి. వినాయకుడికి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించుకున్న మీదటే ప్రారంభిస్తూ ఉంటాం. వ్రతం, శుభకార్యాల్లోనూ తొలి పూజ వినాయకుడికే చేస్తాం. అంతటి ప్రాధాన్యమిస్తాం వినాయకుడికి. ఇప్పటికే ప్రజలంతా ఇళ్లను శుభ్ర పరుచుకుని వినాయకుడిని ఇంటికి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7న దేశమంతా జరుపుకోనుంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి తిథిని గణేశుడి జన్మదినంగా మనం పరిగణిస్తూ ఉంటాం.
ఇక వినాయక చతుర్థి తిథి సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ, తేదీ 2024 సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం 7న వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఇక గణేశుడు మధ్యాహ్నం జన్మించాడని నమ్మకం కనుక మనం పూజ కూడా మధ్యాహ్న సమయంలో చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. వినాయకుడి విగ్రహాన్ని 6వ తేదీన మధ్యాహ్నం తరువాత ఇంటికి తీసుకు రావడం ఉత్తమమని పండితులు తెలియజేస్తున్నారు. శుభ యోగం ఉదయం 11:03 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 01:34 వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు.