సాధారణంగా కొత్తగా పెళ్లైన వధూవరులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు. అలాగే నూతన గృహ ప్రవేశ సమయంలోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇవి రెండూ దాదాపుగా తప్పనిసరిగా జరిగేవే. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా ఏదైనా కష్టం నుంచి బయటపడాలన్నా చేస్తుంటారు. తమ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి నాడు సైతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థిక సమస్యలు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో పాటు ఆరోగ్య, కుటుంబ సమస్యలవంటివి ఎన్నింటికో సత్యనారాయణ స్వామి వ్రతమే పరిష్కారమని చెబుతారు.

ప్రతి మాసంలోనూ పౌర్ణమి తిథి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని మహర్షులు చెప్పారు. అలాంటి వ్రతాన్ని కొందరైతే ఏడాదిలో వచ్చే ప్రతి పౌర్ణమి నాడు నిర్వహించుకుంటూ ఉంటారు. అలా చేయాలనుకునేవారు వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంరభిస్తే మంచిదట. అక్కడి నుంచి ప్రతి పౌర్ణమినాడు తిరిగే వచ్చే ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. శ్రీ మహావిష్ణువును సత్య స్వరూపుడిగా ఆరాధించే అత్యంత పవిత్రమైన పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమని చెబుతారు.
