శ్రీకృష్ణ భగవానుడిని కలుసుకునేందుకు ద్వారకకు వెళ్లిన కుచేలుడిని చూసి పరుగు పరుగున ఎదురొచ్చి మరీ సాదర స్వాగతం పలుకుతూ రాజప్రాసాదంలోకి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ తన భార్య రుక్మిణితో కలిసి కుచేలుడి పాదాలు కడిగాడు. కుచేలుడు అమితానందభరితుడయ్యాడు. ఇద్దరూ కూర్చొని చిన్న నాటి కబుర్లన్నీ చెప్పుకున్నారు. తనకోసం ఏమీ తీసుకురాలేదా? అని కృష్ణుడు అడగ్గా అటకుల మూటను అందించాడు. తనకు ఇష్టమైన అటుకులను తీసుకొచ్చినందుకు శ్రీకృష్ణుడు ఆనందంగా తీసుకున్నాడు. ఇక కృష్ణుడు చేసిన అతిథి మర్యాదలను గుండెల నిండా నింపుకుని తన దారిద్ర్యం విషయాన్ని ఆయనకు చెప్పడమే మరిచి తిరుగు పయనమయ్యాడు కుచేలుడు.
దారిలో తన బాధలేమీ శ్రీకృష్ణుడికి చెప్పుకోలేదన్న విషయం కుచేలుడికి గుర్తొస్తుంది. కానీ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందిలే అనుకుని సంతృప్తిగా తన గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి దరిదాపులకు చేరుతుండగానే కుచేలుడికి అదంతా కొత్త ప్రదేశాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. తన పల్లెలో తానెన్నడూ చూడనంత పెద్ద భవనం కళ్లెదురుగా కనిపించింది. మరి తన నివాసం ఏమైందని వెదుకుతుండగా నౌకరులు వచ్చి కుచేలుడిని ఇంట్లో తీసుకుపోయారు. లోపలికి వెళ్లగానే కుచేలుడికి అతని భార్య ఎదురొచ్చింది. అప్పుడు కానీ కుచేలుడికి అదంతా శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహమేనని తెలియలేదు. ఆ తరువాత కుచేలుని వంశంలోనే ఎవరూ దారిద్ర్య బాధలను అనుభవించలేదు.