హిందూమతంలో శ్రీ మహా విష్ణువు, తులసిలో శాలిగ్రామ అవతార వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం వచ్చిందంటే నెలంతా పండుగ వాతావరణమే ఉంటుంది. ఈ మాసంలోని ద్వాదశి రోజున తులసి కల్యాణం నిర్వహిస్తారు. తులసి కల్యాణం నాటి నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభమవుతాయి. తులసి వివాహం 2024 తేదీ వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసం ద్వాదశి తిథి మంగళవారం, నవంబర్ 12 సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభమై నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది.
సాయత్రం పూజను పరిగణలోకి తీసుకుంటే నవంబర్ 12వ తేదీ.. ఉదయ తిథి ప్రకారమైతే నవంబర్ 13న తులసి వివాహాన్ని జరుపుకుంటారు. ఈ వివాహం కోసం ముందుగా తులసి మొక్కతో పాటు శాలిగ్రామ విగ్రహాన్ని ఒక పీటం మీద ఆసనాన్ని పరిచి దానిపై పెట్టాలి. ముందుగా కలశాన్ని, గౌరీ గణేశుడిని ముందుగా పూజించాలి. అనంతరం తులసి మొక్కకు, శాలిగ్రామ స్వామికి ధూపం, దీపం, వస్త్రాలు, దండలు, పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత పసుపు , కుంకుమ, వంటి వస్తువులతో పాటు ఎరుపు రంగు చున్నీని పెట్టి పూజించాలి. ఆ తరువాత శాలిగ్రామంతో తులసికి ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. దీంతో పూజ ముగుస్తుంది.