
సంవత్సరంలో మొదటి గ్రహణం హోలీ రోజున అంటే మార్చి 14న సంభవించిన విషయం తెలిసిందే. అయితే అది చంద్రగ్రహణం. ఈ క్రమంలోనే ఈ ఏడాది రెండవ గ్రహణం కూడా మార్చి నెలలోనే ఏర్పడనుంది. ఇది ఈ ఏడాది సంభవించనున్న తొలి సూర్యగ్రహణం. అదెప్పుడో తెలుసుకుందాం. మార్చి 29వ తేదీ చైత్ర మాసం ప్రారంభానికి ఒక రోజు ముందు సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ సూర్య గ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాలు చీకటిగా మారనున్నాయి. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది.
ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు. కాబట్టి సూత కాలం అంటూ మనకు ఏమీ ఉండదు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో అయితే సూతకాలం సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. బెర్ముడా, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్‌ల్యాండ్, ఫిన్లాండ్, బార్బడోస్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, కెనడా తూర్పు ప్రాంతాలు, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, లిథువేనియా, హాలండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.
