
మహిళలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండగలలో ఒకటి అట్ల తద్ది. ఈ పండుగను ఐదేళ్ల ఆడపిల్ల నుంచి పెళ్లైన స్త్రీల వరకూ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అసలు ఈ పండుగను ఎప్పుడు జరుపుకుంటాం? ఈ ఏడాది అదెప్పుడు వస్తుందో చూద్దాం. అట్లతద్ది పండగను ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియ తిధి రోజున జరుపుకోవడం సంప్రదాయం. ఈ లెక్కన ఈ ఏడాది మనం అక్టోబర్ 19వ తేదీన అట్లతద్దిని జరుపుకోనున్నాం.
ఇక పెళ్లి అయిన, కాని ఆడవాళ్లు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. పెళ్లి కాని ఆడపిల్లలు తమకు మంచి భర్త లభించాలని.. పెళ్లైన వాళ్లు భర్త దీర్ఘాయుష్షు కోసం అట్లతద్ది పండుగను నిర్వహిస్తారు. ఇక అట్లతద్ది తిథి 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది. రాత్రి సమయంలో గౌరీ పూజ నిర్వహిస్తారు. కాబట్టి మనం అట్లతద్దిని 19వ తేదీ జరుపుకుంటాం. ఈ రోజున పేరంటాలను పిలిచి వాయనాలు సమర్పిస్తారు.
